1991లో అమెరికాకు చెందిన సింగర్ పామ్ రేనాల్డ్స్ అనూహ్యమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆమె మెదడులో ఉన్న అనూరిజం తొలగించేందుకు డాక్టర్లు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను చేశారు. ఈ ప్రక్రియలో ఆమె శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించి, గుండె ధడ పడకుండా చేశారు — దీనిని "హైపోథెర్మిక్ కార్డియాక్ అరెస్ట్" అంటారు. దాదాపు గంటసేపు మెదడు, గుండె, శ్వాస వ్యవస్థ అన్నీ పని చేయని స్థితిలో ఉండడం వల్ల ఆమెను "క్లినికల్‌గా చనిపోయిన స్థితిలో" ఉన్నట్టుగా వైద్యులు పేర్కొన్నారు.
అయితే పామ్ ఆ శస్త్రచికిత్స తర్వాత చైతన్యంతో తిరిగి లేచినప్పుడు చెప్పిన అనుభవాలు అబ్బురపరిచాయి. ఆమె తాను ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లోని సంఘటనలన్నీ విన్నానని, డాక్టర్లు మాట్లాడిన మాటలు, పరికరాలు అన్నింటిని గుర్తు పెట్టుకుందని చెప్పింది. అంతేకాదు, తన శరీరాన్ని బయట నుంచి చూస్తున్నట్టు అనిపించిందని, గాలిలో తేలుతున్నట్లు అనుభవించానని వివరించింది.
ఆ సమయాన తాను ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశానని, ఆ కాంతి తనను లాగుతుందని, అప్పుడు తను గతంలో మరణించిన బంధువులను చూసిందని పామ్ వెల్లడించింది. కానీ అనంతరం ఒక మర్మమైన నీడ తనను తిరిగి రమ్మని కోరిందని, తాను తిరిగి శరీరంలోకి వచ్చానని చెప్పింది. ఇది ఆమెకు మరణానంతర జీవితం ఉందని భావించేలా చేసిందని చెప్పారు.
ఈ అనుభవం వైద్యులకే కాక, శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాలు దీన్ని మెదడులో ఆక్సిజన్ లేమి లేదా అనస్తీషియా ప్రభావంగా చెప్తే, మరికొంతమంది దీనిని ఆత్మ ఉనికి, స్వర్గం ఉన్నదీ అన్న భావనకు మద్దతుగా చూస్తున్నారు. పామ్ రేనాల్డ్స్ ఘటన "మృత్యువు దగ్గర అనుభవం" (NDE)లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కేసులలో ఒకటిగా నిలిచింది.